గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చిన్న పోతంగల్ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పుప్పాల భాగ్యలక్ష్మి(45)కి 18ఏళ్ల క్రితం ఆదే గ్రామానికి చెందిన రాములుతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు పుట్టలేదు. భాగ్యలక్ష్మి గత కొన్నేళ్లుగా పలు వ్యాధులతో బాధపడుతుంది. ఈక్రమంలో గురువారం రాత్రి భోజనాల అనంతరం భర్త నిద్రపోయాక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం కుటుంబ సభ్యులు వెతకగా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలింది. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట మండలంలో..
నవీపేట: మండలంలోని నందిగామ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. నందిగామ గ్రామానికి చెందిన కర్రోల్ల పోశెట్టి(43) తాగుడుకు బానిసై, తరచూ భార్య రోజాతో గొడవపడేవాడు. ఈనెల 27న రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ జరగడంతో తాగిన మైకంలో పోశెట్టి శివారులోని కొత్తకుంట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్ మండలంలో..
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా.. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన గూల కిష్టయ్య(30) మత్య్సకార్మికుడిగా జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెందిన కిష్టయ్య శుక్రవారం గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు.