● ఇంకా అందని సమగ్ర కుటుంబ
సర్వే పారితోషికం
● నాలుగు నెలలు గడిచినా
విడుదల కాని నిధులు
బీబీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లకు ఇప్పటికీ పారితోషికాలు అందించలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌లో సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 2,97,300 కుటుంబాలను 2,366 మంది ఎన్యుమరేటర్లు, 237 మంది సూపర్‌వైజర్లు సర్వే చేశారు. ఈ వివరాలను సుమారు 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కాగా సర్వే నిర్వహించినందుకు ఎన్యుమరేటర్లకు రూ. 10 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల చొప్పున పారితో షికం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. కానీ సర్వే పూర్తై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారితోషికానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం
సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికం ఇంకా విడుదల కాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నిధులివ్వ గానే అందిస్తాం. – పూర్ణచంద్రోదయకుమార్, ఎంపీడీవో, బీబీపేట
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ చేశాను. నాలు గు నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వం ఇప్పటికై నా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. – రాజు, డాటా ఎంట్రీ ఆపరేటర్, తుజాల్‌పూర్
ఎన్యుమరేటర్లకు పైసలెప్పుడిస్తరో?
ఎన్యుమరేటర్లకు పైసలెప్పుడిస్తరో?