
‘బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’
కామారెడ్డి క్రైం: రిసెప్షన్ విధులు నిర్వహించేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం రిసెప్షన్ వర్టికల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీఎస్‌లకు వచ్చే ఫిర్యాదును తక్షణమే నమోదు చేయాలన్నారు. దానికి వెంటనే రశీదు ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
19న మామిడి చెట్ల
కాత వేలం
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రంలో 20 ఎకరాలలో గల మామిడి చెట్ల కాతను ఈనెల 19న వేలం వేయనున్నట్లు ఉద్యాన క్షేత్ర అధికారి కమలాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు ముందుగా వెయ్యి రూపాయల డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. 19న ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభమవుతుందని తెలిపారు.
గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
తాడ్వాయి/రాజంపేట: పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకా వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి సంజయ్ కుమార్ సూచించారు. బుధవారం తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి, రాజంపేట మండల కేంద్రంలలో నిర్వహించిన పశువైద్య శిబిరాలలో పాల్గొన్నారు. పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15 వరకు అన్ని గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహించి టీకాలు వేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారులు రమేశ్, అనిల్‌రెడ్డి, వీఎల్‌వో పోచయ్య, సిబ్బంది కొండల్‌రెడ్డి, ప్రేంసింగ్, రాజ వీరయ్య, రాజేశ్వర్, రమేశ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాలను
సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు మంచి స్పందన లభించిందని ఇంటర్ కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ అన్నారు. న్యూ లాండ్ లాబరేటరీ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 17న ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 18న బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా ఉంటాయన్నారు. ప్రిన్సిపల్ శివ, అధ్యాపకులు స్వరూప్, సమీ, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాఖ్, లైబ్రేరియన్ కార్తిక్, న్యూలాండ్ ల్యాబరేటరీ సంస్థ ప్రతినిధులు, కళాశాల అభివృద్ది కమిటి సభ్యులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

‘బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

‘బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’