
మోడల్ ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేదెన్నడు?
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లు పనులు అర్ధంతరంగా నిలిచాయి. ప్రభుత్వం మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లును నిర్మించడానికి రూ.5లక్షలు మంజూరు చేసింది. ఇల్లు నిర్మించడానికి కేటాయించిన స్థలంలో హౌజింగ్ అధికారులు కొలతలు చేసి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన నెలకు పనులు ప్రారంభించారు. సిమెంటు, కంకర వేసి 12రోజుల గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మోడల్ ఇల్లు నిర్మాణం పూర్తయితే ఈ ఇల్లును చూసి తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలుస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తొందరగా మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.