
చెరువులో జారిపడి ఒకరి మృతి
జక్రాన్‌పల్లి: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మార్చి 30న చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మచ్చ మహేందర్(48) ఉగాది రోజున మామిడి, వేప ఆకుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికారు. కాగా, మహేందర్ 31న(సోమవారం) చెరువులో మృతదేహమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్ ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో చెరువు వద్ద కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య మచ్చ రజిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేందర్ ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మెడికల్‌లో పనిచేసేవాడని, భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
బోధన్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పెగడపల్లి నుంచి బోధన్ వైపు మార్చి 29న ఉదయం కాలినడక వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని బర్దీపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి సోమవారం ఉదయం మృతి చెందాడని, దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35ఏళ్లు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పేర్కొన్నారు.