● రేషన్ బియ్యం తూకంలో మోసం
● లబోదిబోమంటున్న రేషన్ డీలర్లు
● అధికారులు పట్టించుకోవడం
లేదని ఆవేదన
కామారెడ్డి రూరల్: సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ గోదాం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తోందని రైషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కిలోల బస్తాలో దాదాపు 4 నుంచి 6 కిలోల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయని అంటున్నారు. ప్రతి 50 కిలోల బస్తాకు బ్యాగు బరువుతో 5.80 గ్రాములు కలిపి ఖచ్చితంగా తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాలి. తాము మాత్రం లబ్ధిదారులకు సరైన తూకంతో బియ్యం పంపిణీ చేస్తుండగా, తమకు సరఫరా అవుతున్న సంచుల్లో బియ్యం తక్కువగా వస్తోందని డీలర్లు వాపోతున్నారు. దీనిని ఎవరు భరించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గోదాం నిర్వహకులు బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాలోని ఏడు ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో ఉందని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.