క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Published Sat, Apr 5 2025 12:50 AM | Last Updated on Sat, Apr 5 2025 12:50 AM

క్రిక

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌, ఆర్మూర్‌లోని బెట్టింగ్‌ ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్‌లో బెట్టింగ్‌ ముఠాకు చెందిన మొత్తం ఏడుగురిని పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న నగరంలోని ఆటోనగర్‌ భారతీరాణి కాలనీకి చెందిన షేక్‌ ముజీబ్‌ అహ్మద్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఐదో టౌన్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముజీబ్‌ అహ్మద్‌తోపాటు బెట్టింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న షేక్‌ నదీం, షేక్‌ జునైద్‌, షేక్‌ రహాన్‌ను అరెస్టు చేశారు.

ముజీబ్‌కు రెండేళ్ల క్రితం సాలూర మండలానికి చెందిన షకీల్‌ ద్వారా నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన బెట్టింగ్‌ మాస్టర్‌ సచిన్‌ పరిచయమయ్యాడు. ఈజీ మనీకి ఆశపడి ముజీబ్‌ సచిన్‌ ద్వారా ఏజెంట్‌గా చేరాడు. సచిన్‌పైన ఉండే సూపర్‌ మాస్టర్‌ ద్వారా ఆన్‌లైన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పొందాడు. అనంతరం సుమారు 1000 మంది అమాయకులకు ఆశచూపి బెట్టింగ్‌లోకి దించాడు. యూజర్స్‌ డిపాజిట్‌ చేసిన డబ్బు ఏజెంట్‌ ద్వారా మాస్టర్‌కు చేరి, అనంతరం మాస్టర్‌ నుంచి ఏజెంట్‌కు 7 శాతం కమీషన్‌ వస్తుంది. ఇందులో 200 మంది బెట్టింగ్‌కు పాల్పడగా, ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.88 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. ఈ కేసులో సాలూరకు చెందిన షకీల్‌, ఆటోనగర్‌కు చెందిన షేక్‌నజీబ్‌, నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన సచిన్‌, ట్రావెల్స్‌ యజమాని రమేశ్‌ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 50 వేలు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు పాసుబుక్‌లు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన నార్త్‌ సీఐ బూక శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అంజయ్య, ఎస్సైలు గంగాధర్‌, లక్ష్మయ్యను సీపీ అభినందించారు.

పరారీలో ఐదుగురు..

ఆర్మూర్‌ పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న ఎనిమిది మందిని గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. హర్యానా రాష్ట్రం మంగ్‌కు చెందిన విపుల్‌, మహారాష్ట్రలోని బోరికి చెందిన బంటు పలాస్‌ అలియాస్‌ శేఖర్‌, యావత్మాల్‌కు చెందిన బబ్లూ ఠాకూర్‌, వినాయక్‌ ఠాకూర్‌ నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లను వాట్సాప్‌ల ద్వారా ఆర్మూర్‌కు చెందిన గట్టడి గౌతమ్‌, దయాళ్‌ సునీల్‌, జాజు రంజిత్‌, శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీకర్‌లకు పంపించారు. దీంతో ఈ నలుగురు కొన్ని రోజుల నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. బెట్టింగ్‌ ద్వారా వచ్చిన డబ్బును సునీల్‌ అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు ఇచ్చి వారి బైక్‌లను తాకట్టు పెట్టించుకున్నాడు. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు ఆర్మూర్‌లోని గట్టడి గౌతమ్‌ ఇంట్లో సునీల్‌, రంజిత్‌ బెట్టింగ్‌ ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 సెల్‌ఫోన్లు, రూ.6 వేలు, తాకట్టు పెట్టుకున్న 34 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. కాగా, ఆర్మూర్‌లోని హుస్నాబాద్‌గల్లీకి చెందిన గట్టడి శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీకర్‌తోపాటు విపుల్‌, బంటు పలాస్‌ అలియాస్‌ శేఖర్‌, బబ్లూ ఠాకూర్‌, వినాయక్‌ ఠాకూర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును చేధించిన ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్‌ సీఐ అంజయ్య, ఎస్సై మహేశ్‌ను సీపీ అభినందించారు.

నిజామాబాద్‌లో నలుగురు,

ఆర్మూర్‌లో ముగ్గురు

ఆర్మూర్‌లో 34 బైక్‌లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

సీపీ పోతరాజు సాయిచైతన్య

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు1
1/1

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement