ఖలీల్‌వాడి: ఇటీవల పాంగ్రాలో జరిగిన ఒంటరి మహిళ హత్య ఘటనలో నిందితుడిని పట్టుకొని, అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని పాంగ్రాలో చారుగొండ చంద్రకళ(55) ఒంటరిగా నివసిస్తుండగా, ఆమెకు కల్లు దుకాణంలో కామారెడ్డి జిల్లాలోని హరిజనవాడకు చెందిన శంషాబాద్ విజయ్ ఆలియాస్ విష్ణు ఆలియాస్ చింటూ పరిచయమయ్యాడు. గతనెల 23న ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడానికి ఇంటికి వెళ్లి కల్లు తాగించాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవికమ్మలు, మాటీలు, వెండి ఆభరణాలతోపాటు సెల్‌ఫోన్‌ను నిందితుడు తీసుకొని, వెంటతెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. అదే గ్రామంలోని ఓ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌పై పారిపోయాడు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా, నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే అతడి వద్ద నుంచి ఏడు గ్రాముల బంగారం, 75 గ్రాముల వెండి, హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన సీఐ శ్రీనివాసరాజు, ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని సీపీ అభినందించారు.