
కాంగ్రెస్ పాలనలో దిగజారిన ఆర్థిక స్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే, రేవంత్‌రెడ్డి పాలనలో 11వ స్థానానికి దిగజారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జీఎస్‌డీపీ వృద్ధి రేటులో మూడో స్థానంనుంచి 14వ స్థానానికి పడిపోయిందన్నారు. బుధవారం సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి కోట్లాది మంది ప్రజలను కదిలించి రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారన్నారు. 24 గంటల కరెంటు, ఇంటింటికీ నల్లా నీళ్లు అందించారన్నారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు దళారుల బెడద తప్పించామన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఐదు వందల రోజులైనా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
జిల్లా నేతలతో సమీక్ష
వరంగల్ సభను విజయవంతం చేయడానికి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజక వర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేలతోనూ సమావేశమై చర్చించారు.
వరంగల్ సభకు భారీగా తరలిరావాలి
గులాబీ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తై 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్‌లో సభ నిర్వహించనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆ సభకు కామారెడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ నేతలు రాజేశ్వర్‌రావ్, నర్సింలు, మహేందర్‌రెడ్డి, కపిల్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, మోయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలును విస్మరించారు
ప్రభుత్వంపై మాజీ మంత్రి
వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు