
మహిళలే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతలు
తెయూ(డిచ్‌పల్లి): మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని పాలమూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మనోజ పేర్కొన్నారు. మహనీయుల జయంతి వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ వర్సిటీ ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన ‘సీ్త్రల హక్కులు– లింగ న్యాయం’ అనే అంశంపై శనివారం కార్యశాల నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రొఫెసర్ మనోజ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, రక్షణ చట్టాలు, హిందూ వివాహ వ్యవస్థపై అంబేడ్కర్ చేసిన కృషితోనే దేశంలో మహిళల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కుటుంబ వ్యవస్థలో సమానమైన ఆస్తి మహిళలకు లభించాలన్న హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా, బిల్లు వీగిపోవడంతో నిరసనగా అంబేడ్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పురుషులతో సమానంగా సీ్త్రలకు వేతనాలు చెల్లించే చట్టాలు, సీ్త్రలను గౌరవించి ప్రసూతి సెలవులను ఇప్పించే చట్టాలను చేయడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. యువత పెడధోరణులు పడుతున్న నేపథ్యంలో వర్తమాన సమాజంలో సీ్త్రల హక్కులు, లింగ న్యాయం అనే అంశం చర్చించడం అత్యవసరమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ మనోజను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, రిసోర్స్ పర్సన్ స్రవంతి, కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు, సీవోఈ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు వర్సిటీ ప్రొఫెసర్ మనోజ

మహిళలే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతలు