
మూలమలుపులో మృత్యుపిలుపు
దేశాయిపేట్‌లో దంగల్
లింగంపేట : కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి(కేకేవై) రహదారిపై ప్రమాదకర మూలమలుపులున్నాయి. ప్రధానంగా ఎల్లారెడ్డి నుంచి లింగంపేట వరకే(14 కిలోమీటర్లు) 42 మలుపులుండడం గమనార్హం. ఇందులో 12 వరకు ‘ఎస్’ ఆకారంలో ఉండడంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అయినా అధికారులు మేల్కోవడం లేదు. కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. వర్షాకాలంలో పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతోంది. మూల మలుపుల వద్ద చెట్లు ఏపుగా పెరగడంతో ముందు వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మూలమలుపుల కారణంగా వేగంగా వెళ్తున్న బైకులు, ఇతర వాహనాలు మూల మలుపుల్లో అదుపుతప్పి చెట్లను ఢీకొనడం, ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడం, రోడ్డు కిందికి వెళ్లడం జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి మూల మలుపుల్లో సూచిక బోర్డులతోపాటు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మూల మలుపుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు..
లింగంపేట నుంచి ఎల్లారెడ్డి వెళ్లే క్రమంలో లింగంపేట సబ్‌స్టేషన్ వద్దనున్న మూల మలుపులో ఓ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో లింగంపేటకు చెందిన మహిళ మృతి చెందింది.
లింగంపేట మండల కేంద్రం సమీపంలోని దర్గా వద్ద మూల మలుపులో ఆటో బైకు ఢీకొ న్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
మెంగారం చెరువు వద్ద మూల మలుపులో కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముంబోజీపేటకు చెందిన ఇద్దరు యువకులు చనిపోయారు.
మెంగారం గ్రామానికి చెందిన కొమ్ముల మల్లేశం బైకు లింగంపేట పెద్దవాగు వద్ద అదుపు తప్పడంతో రోడ్డు కింద పడి మృతి చెందాడు.
మెంగారం మిద్దె మిట్టు దిగుడుకు మూల మలుపుల్లో బస్సు బైకు ఢీకొన్న ఘటనలో పొల్కంపేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు.
కొట్టాల్ శివారులోని మూలమలుపులో 2018లో బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో అప్పటి మెగారం సర్పంచ్ తంతిరి ప్రభాకర్ మరణించారు.
లింగంపేట పెద్దవాగు సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.
లింగంపేట రాధా స్వామి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
లింగంపేట –ఎల్లారెడ్డి మధ్య
14 కిలోమీటర్ల దూరం
42 చోట్ల ప్రమాదకర మలుపులు
సూచిక బోర్డులు కరువు
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా
పట్టించుకోని అధికారులు