
వారసత్వ చెరువు.. నోచుకోని అభివృద్ధి
కామారెడ్డి అర్బన్ : ప్రపంచ వారసత్వ కామారెడ్డి పెద్ద చెరువు అభివృద్ధికి నోచుకోవడంలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో 2016 సంవత్సరంలో మిషన్ కాకతీయ ఫేజ్–2 కింద రూ. 8కోట్ల 96 లక్షల వ్యయం అంచనాతో కామారెడ్డి పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు జూలై 17, 2016 లో పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు కొనసాగుతునే ఉన్నాయి. చెరువు కట్టపై నిర్మించిన పాదచారుల బాట ముళ్ల చెట్లతో బీటలు వారుతు ఎక్కడికక్కడ పగిలిపోయింది. భూసత్తెమ్మ గుడి సమీపంలో చెరువు కట్టకుంగిపోయింది. పట్టణానికి ప్రధాన నీటి వనరుగా ఉండడంతో పాటు పాత పట్టణానికి నీరు అందించే ఈ చెరువుపై పాలకులు నిర్లక్ష్యం వహించడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చెరువు కట్టపై వాకింగ్ చేసి పనులను కళ్లరా చూసినా నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైన పెద్ద చెరువుపై శ్రద్ధ వహించి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి సుందరీకరణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నిధులున్న మేరకు పనులు చేశాం
కాకతీయ ఫేజ్ –2 కింద మంజూరైన నిధులతో చెరువు కట్ట బలోపేతం, పాదచారుల బాట, సోలార్ దీపాలు, అలుగు పనులు పూర్తి చేశాం. మద్యంబాబులు సోలార్ దీపాలు పగులగొట్టారు. ముళ్ల చెట్టుతో పాదచారుల బాట ధ్వంసమైంది. కట్టపై పిచ్చి మొక్కలు ఇలా తొలిగిస్తే అలా మొలుస్తున్నాయి. పురపాలక సంఘం నిత్యం చూసుకుంటే తప్ప అక్కడ సుందరీకరణ సాధ్యం కాదు. నిధులు వస్తే కట్ట కుంగిన ప్రాంతాల్లో మరమ్మతులు చేస్తాం.
– సాయి సుధాకర్, డీఈఈ, కామారెడ్డి,
నీటిపారుదల శాఖ
రూ.8.96 కోట్ల వ్యయంతో
మినీ ట్యాంక్ బండ్, పునరుద్ధరణకు
శంకుస్థాపన
ముళ్లచెట్లతో దర్శనమిస్తున్న
కామారెడ్డి పెద్దచెరువు
అధికారుల నిర్లక్ష్యంపై
పట్టణ ప్రజల ఆగ్రహం

వారసత్వ చెరువు.. నోచుకోని అభివృద్ధి

వారసత్వ చెరువు.. నోచుకోని అభివృద్ధి