
పారిశుధ్య కార్మికులకు భద్రతేది..?
కామారెడ్డి టౌన్: పారిశుధ్య కార్మికుల భద్రతను బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదు. వారికి విధుల్లో భాగంగా సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు, షూ, చేతి గ్లౌజ్‌లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు. 9నెలల క్రితం కేవలం రెండు జతల దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికులు మురికి కాలువల్లో, రోడ్లను శుభ్రం చేసే పనుల్లో చేతికి గ్లౌజ్‌లు, కాళ్ల షూ లేకుండా పనులు చేయడంతో అనారోగ్యపాలవుతున్నారు.పాలక వర్గం ముగిసి ప్రత్యేకపాలన వచ్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని కార్మికులు వాపోతున్నారు. బుధవారం పట్టణంలోని సిరిసిల్లారోడ్‌లో నిలిచిన మురుగు నీటిలో కార్మికుడు దిగి పూడికను శుభ్రం చేశాడు. సంరక్షణగా చేతులకు ఎలాంటిి గ్లౌజ్‌లు, కాళ్లకుబూట్లు లేకుండానే పని చేశాడు.
టెండర్‌లో భారీ కుంభకోణం ఆరోపణలు
కామారెడ్డి మున్సిపల్ శానిటేషన్ విభాగంలో 256 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా వీరికి సబ్బులు, నూనెలు, ఆర్పన్స్, చెప్పులు,షూ పంపిణి చేయాల్సి ఉంటుంది. వీటిని కార్మికులకు ఇచ్చేందుకు ఏటా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా అత్యవసరం పేరిట మూడు, నాలుగు ఏళ్లకు ఒక సారి పంపిణీ చేస్తున్నారు. ఓ ఏడాది ప్రజాప్రతినిధి బినామి పేరిట టెండర్ వేసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్షల్లో బిల్లులు తీసుకుని కేవలం దుస్తులు మాత్రమే పంపిణీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఉత్త చేతులు, కాళ్లతో మురికి కాలువల్లో, రోడ్లపై చెత్త తొలగింపు
అనారోగ్యం బారిన పడుతున్న
బల్దియా కార్మికులు
సబ్బులు, నూనెలు, గ్లౌజ్‌లు, బూట్లు ఇవ్వని అధికారులు
త్వరలో కార్మికులకు అందజేస్తాం
కార్మికులకు త్వరలో సబ్బులు, నూనెలు ఇతర సామాగ్రి అందజేస్తాం. అన్ని అందేలా చర్యలు తీసుకుంటాం. 8 నెలల క్రితం దుస్తులను పంపిణీ చేశాం. ఆర్థికం సంక్షోభంతో కాస్తా ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే కార్మికులకు అన్ని వస్తువులను అందజేస్తాం. – రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి

పారిశుధ్య కార్మికులకు భద్రతేది..?

పారిశుధ్య కార్మికులకు భద్రతేది..?