
ఆడవాళ్ల ఆత్మగౌరవం పట్టదా?
బిచ్కుంద(జుక్కల్): మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న అధికారులు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను పట్టించుకోవడం లేదు. బిచ్కుంద బస్టాండ్‌లోని మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా విరిగిపోయినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఒకరు బయట నిల్చుని చున్నీ లేదా చీర కొంగు అడ్డుగా పెట్టి నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. బిచ్కుంద బస్టాండ్ నుంచి ప్రతిరోజూ దెగ్లూర్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, బీదర్, ఔరాద్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్‌లోని స్టాల్స్ ద్వారా ప్రతి నెలా ఆర్టీసీకి లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల కాంట్రాక్టర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవిని వివరణ కోరగా.. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకొని మరమ్మతులు చేయిస్తామన్నారు.
అపరిశుభ్రంగా ఉన్న మూత్రశాలలు

ఆడవాళ్ల ఆత్మగౌరవం పట్టదా?