
పెరిగిన వరికోత యంత్రాల కిరాయి
బాన్సువాడ : బాన్సువాడ ప్రాంతంలో యాసంగి వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరి కోత యంత్రాల కిరాయిలు భారీగా పెరిగాయి. గత వర్షకాలం వరి కోతలు చేసే టూ వీలర్ హార్వేస్టర్ యంత్రానికి గంటకు రూ.2200 ఉండగా ఇప్పుడు రూ.2400 నుంచి రూ.2500 వరకు పెంచారు. ఫోర్ వీలర్ యంత్రానికి గతంలో గంటకు రూ.2500 చొప్పున తీసుకోగా ఇప్పుడు ఆ ధరను రూ.2600 నుంచి రూ.2800 వరకు పెంచారు. తడి నేలలు నీటితో ఉన్న కమతాల్లో వరిని కోసేందుకు ట్రాక్ యంత్రానికి (చైన్) గత వర్షకాలంలో గంటకు రూ.2800 ఉండగా ఇప్పుడు రూ.2900 చేశారు. పశుగ్రాసం సేకరణలో భాగంగా ఎండుగడ్డిని కట్టలు కట్టేందుకు వినియోగించే బేలర్ యంత్రం ధరను యాజమానులు పెంచారు. గతంలో కట్టకు రూ.20 తీసుకోగా ప్రస్తుతం రూ.30 నుంచి రూ.35 కి పెంచారు. ధాన్యాన్ని బస్తాల్లోకి, ట్రాక్టర్ల మీదకు చేర్చేందుకు కూలీ రెట్టింపు అయింది. గతంలో బస్తాకు రూ. 20 ఉండగా ఇప్పుడు రూ.30 తీసుకుంటున్నారు. ట్రాక్టర్ల యాజమానులు సైతం రవాణా చార్జీలు భారీగా పెంచారు. గతంలో ఒక్కో లోడ్ రూ.500 తీసుకుంటే ప్రస్తుతం రూ.700 పెంచారు. గడ్డి కట్టలను సైతం ఇంటికి చేర్చేందుకు ఒక్కో కట్టకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు .ధాన్యాన్ని కల్లాలు, మిల్లులు, ఇళ్లకు తరలించేందుకు రవాణా చార్జీలు సైతం తడిపి మోపెడవుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలను సాకుగా చూపుతూ యంత్రాలు, ట్రాక్టర్ల యజమానులు ధరను అమాంతం పెంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తడిపి మోపెడవుతున్న రవాణా చార్జీలు
ఆర్థికంగా కుదేలవుతున్న రైతులు
దిగుబడి తగ్గే అవకాశం
ఈ యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. పైరుకు రెండు సార్లు స్ప్రే చేశా. గింజ పాలుపొసుకోక తాలుగా మారింది. తాలువల్ల పొలమంతా తెల్లగా కనిపిస్తోంది. గతంలో 25 క్వింటాళ్ల దిగుబడి సాధించా. ఇప్పుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వరి కోతలకు యంత్రాల ధరలను పెంచితే మాకు మిగిలేది అంతంత మాత్రమే.
– నారాయణ, రైతు, బాన్సువాడ
ఏం మిగిలేలా లేదు
నాకున్న పదెకరాల్లో వరి పంట వేశాను. గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ సారి పంట బాగానే వచ్చింది. మూడు సార్లు స్ప్రే చేశా. ఆకాల వర్షానికి పంట పూర్తిగా నేలకొరిగింది. ట్రాక్టర్లు, యంత్రాలకు రేట్లు పెంచారు. ఖర్చులు పోను ఏమి మిగిలేలా లేదు.
– దోసాయి వెంకట్, రైతు, అన్నారం

పెరిగిన వరికోత యంత్రాల కిరాయి

పెరిగిన వరికోత యంత్రాల కిరాయి