
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
లింగంపేట : ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బాయంపల్లి, కన్నాపూర్ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. బాయంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ మాట్లాడారు. రైతులకు భూ భారతి పోర్టల్‌పై అవగాహన కల్పించారు. రైతులు తమ సమస్యలను ధరఖాస్తులో స్పష్టంగా రాసి అధికారులకు అందించాలని సూచించారు. పథకం అమలు తీరు, పథకంలో ఏ ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో వివరించారు. సదస్సుల్లో ఈనెల 30వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత జూన్ 2వ తేదీ వరకు రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 30 రోజుల్లో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో, కలెక్టర్ పరిధిలో పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ పరిష్కారం కానివాటిపై ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలపై సంయుక్తంగా సర్వే చేసి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. కోర్టు కేసులు ఉంటే తమ దృష్టికి తెస్తే సాధ్యమయ్యేవి అయితే అమ్మిన వారికి, కొన్న వారికి నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. బాయంపల్లిలో 86 దరఖాస్తులు, కన్నాపూర్ గ్రామంలో 74 దరఖాస్తులు వచ్చాయన్నారు. బాయంపల్లిలో 19 సర్వే నంబరులో 50 మంది రైతులకు చెందిన 408 ఎకరాలు, 75 సర్వే నంబరులో 25 మందికి సంబంధించిన 135 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదై ఉన్నట్లు రైతులు తన దృష్టికి తెచ్చారన్నారు. వాటిని విచారించి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఉపతహసీల్దార్ రాందాస్, ఎఫ్‌ఆర్‌వో ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్