
నేటి నుంచి రైతు మహోత్సవం
● ప్రారంభించనున్న మంత్రులు
తుమ్మల, ఉత్తమ్, జూపల్లి
● మూడు రోజులపాటు
కొనసాగనున్న కార్యక్రమం
● వ్యవసాయ, అనుబంధ
రంగాల స్టాళ్ల ప్రదర్శన
● గిరిరాజ్ కళాశాల మైదానంలో
ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం నుంచి బుధవారం వరకు రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమం పురస్కార గ్రహీతలైన అభ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు వేదిక కానుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇందుకోసం సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాస్త్రవేత్తలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహిస్తారని, అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

నేటి నుంచి రైతు మహోత్సవం