
ఎస్‌ఆర్‌ఎన్‌కే @ 25 ఏళ్లు
బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల
బాన్సువాడ : రెండున్నర దశాబ్దాల క్రితం వెలసిన ఈ చదువులమ్మ గుడి.. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చింది. తన నీడన చేరిన వారికి జ్ఞానాన్ని అందిస్తూ విద్యావృక్షంగా ఎదిగిందీ డిగ్రీ కళాశాల. బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే (శ్రీరాం నారాయణ్ ఖేడియా) డిగ్రీ కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 24న రజతోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులో ఉన్న గ్రూపులు...
ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ, ఎంజెడ్‌సీఎస్, పీజీ తెలుగు, పీజీ ఇంగ్లిష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 52 తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. కళాశాలకు 2022– 23 సంవత్సరంలో బీ+ న్యాక్ గుర్తింపు లభించింది. 2024–2025లో అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా లభించింది. ప్రస్తుతం 1,338 మంది విద్యార్థులు చదువుతున్నారు.
అంకురార్పణ ఇలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాన్సువాడకు డిగ్రీ కళాశాల మంజూరు కాగా దేశాయిపేట్ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించారు. యజమాని, పారిశ్రామికవేత్త శ్రీరాం నారాయణ్ ఖేడియాను సంప్రదించగా స్థలాన్ని ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. కానీ కళాశాలకు తన పేరు పెట్టాలని కోరడంతో అప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేసి ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలగా నామకరణం చేశారు. దీంతో బాన్సువాడకు రెండు కిలోమీటర్ల దూరంలో 11.16 ఎకరాల స్థలంలో 25 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కళాశాలను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 24న
సిల్వర్ జూబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు
పూర్వ విద్యార్థులకు ఆహ్వానం
పూర్వ విద్యార్థులను సన్మానిస్తాం
ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల ప్రారంభమై 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 24న సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నాం. వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సన్మానిస్తాం.
– వేణుగోపాల్ స్వామి, ప్రిన్సిపల్,
ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల

ఎస్‌ఆర్‌ఎన్‌కే @ 25 ఏళ్లు