పదిరోజులుగా ఆచూకీ లేక కుటుంబ సభ్యుల ఆందోళన
ఎంబసీ అధికారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ
షార్జాలో ఆచూకీ లభ్యం.. నేడు ఇల్లు చేరనున్న వలసజీవి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్‌లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. దుబాయ్‌లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్‌తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.
ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment