రైతులకు పరామర్శలే ప్రాప్తం
● అటకెక్కిన పంటల బీమా పథకాలు
● ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టం
● కొత్త ఇన్సూరెన్స్ పథకం కోసం రైతుల ఎదురుచూపు
జగిత్యాలఅగ్రికల్చర్: ఏటా రైతులు అయితే అధిక వర్షాలు.. లేకుంటే వడగండ్లు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లముందే ధ్వంసమై.. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా ఉంటామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కనీసం పంటల బీమా పథకాలైనా ఆదుకుంటాయని అనుకుంటే ఆ పథకాలు ఎప్పుడో అఆటకెక్కాయి. ఫలితంగా పంటలు నష్టపోయిన రైతులు తమ ఖర్మ అనుకుంటూ దేవుడిపై భారం వేస్తున్నారు.
పరిహారం ఇవ్వకుండా లేనిపోని నిబంధనలు
పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు పరిహారం అందించాలి. కానీ ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలను ఎప్పుడో మర్చిపోయాయి. పైగా పరిహారం విషయంలో ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టింది. 33శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే వ్యవసాయ అధికారులు నివేదిక తయారు చేసే పరిస్థితి నెలకొంది. కొన్ని అధికారులు నివేదిక పంపినా పరిహారం మాత్రం అందడం గగనంగానే మారింది. ఏటా అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంట దెబ్బతిన్నప్పటికీ.. అధికారులు నివేదికలకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నయాపైసా వచ్చిన పాపాన పోలేదు. ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, నువ్వు, వరి పంటలు ఇటీవల వడగండ్ల వర్షాలకు నేలవాలి నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం జరగలేదని అధికారులు నివేదిక రూపొదించడంలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం హడావుడి చేసి రైతులను పరామర్శిస్తున్నారు తప్పితే పరిహారం ఇప్పించే దిశగా ఆలోచన చేయడం లేదు.
అటకెక్కిన బీమా పథకాలు
పంటలకు నష్టం జరిగితే పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు పంటల బీమా పథకాలు అమలయ్యేవి. మొదటిది.. పంటల బీమా పథకం (ఫసల్ బీమా యోజన), రెండోది.. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లిస్తుండగా.. మరి కొంత రైతులు చెల్లించేవారు. ఈ పథకాలను ప్రభుత్వాలు తీసుకొచ్చినా.. సరైన నిబంధనలు లేక రైతులకు బీమా అందడం లేదు. పంటల బీమా పథకంలో భాగంగా పంట రుణం తీసుకున్న రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం వసూలు చేసి ఇన్సూరెన్సు సంస్థలకు చెల్లించేవి. అయితే నష్టం జరిగినప్పుడు రైతులకు పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్ సంస్థలు మీనమేషాలు లెక్కించాయి. రైతు యూనిట్‌గా కాకుండా.. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో ఏ ఒక్క రైతుకూ పంట నష్ట పరిహారం రాలేదు. పథకంలో పలు లోపాలున్నాయంటూ గత ప్రభుత్వం రద్దు చేసింది.
వాతావరణ ఆధారిత బీమా
అధిక ఉష్ణోగ్రతలు, వడగండ్లు, ఈదురుగాలుల వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిర్చి, పత్తి వంటి పంటలు నష్టపోతే ఆయా పంటలకు పరిహారం వచ్చేలా ప్రభుత్వం వాతావరణ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినా నష్టం జరిగినప్పుడు పలు నిబంధనలను సాకుగా చూపి ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి. ఇందుకోసం మండలాల్లో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాలు ఇచ్చే సమాచారాన్ని ప్రమాణికంగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగితే వాతావరణ కేంద్రం నుంచి సరైన సమాచారం వెళ్లకపోవడంతో ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీనిపైనా రైతులు ఆందోళనలు చేశారు. అయినా ఇన్సూరెన్స్ సంస్థలు పట్టించుకోకపోవడంతో ఈ పథకాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది.
ఊరిస్తున్న పంటల బీమా పథకం
ఇప్పటివరకు ఉన్న బీమా పథకాలు రైతులకు న్యాయం చేయలేకపోయాయని, కొత్తగా ఆమోదయోగ్యమైన బీమా పథకాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకుంటామని, ఏ పంటకు నష్టం జరిగినా ఇన్సూరెన్సు సంస్థ పరిహారం అందించేలా చూస్తామని చెబుతోంది. ఇన్సూరెన్సు సంస్థలకు ప్రీమియం కూడా చెల్లిస్తామని చెబుతున్నా.. ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియడం లేదు. తాజాగా వడగండ్లతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం ఇవ్వాలి
ఇన్సూరెన్స్ పథకాలు అమల్లో లేకపోవడంతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహా రం అందించి రైతులను ఆదుకోవాలి. ఇది నాలాంటి రైతులందరి సమస్య. పంటలు సాగు చేసిన చాలామంది రైతులు పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. – బందెల మల్లయ్య, చల్‌గల్, జగిత్యాల
ప్రభుత్వానికి నివేదిస్తాం
జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రైతులకు ఆమోదయోగమైన ఇన్సూరెన్స్ పథకాలు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ విధానం అమల్లోకి వస్తే రైతులందరికీ న్యాయం జరుగుతుంది.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల
రైతులకు పరామర్శలే ప్రాప్తం
రైతులకు పరామర్శలే ప్రాప్తం