మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలోని ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. 8వ తరగతి చదువుతున్న రాపర్తి హర్షకు గురువారం ఉదయం సమయంలో ఒక్కసారిగా కుడిచేతికి నొప్పి రావడం, నీరసించడం, కళ్లు తిరుగుతుండడం, ఏదో కరిచినట్లు గీర్లలాగా ఉండడాన్ని తోటి విద్యార్థులకు తెలిపాడు. దీంతో వారు ప్రిన్సిపాల్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన ప్రిన్సిపాల్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి, హర్షను కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం వరకు చికిత్స అందించిన వైద్యులు.. తర్వాత డిశ్చార్జ్ చేశారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు విద్యార్థిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
విద్యార్థి అస్వస్థతతో అప్రమత్తం..
హర్ష అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. అయిలాపూర్ వైద్యాధికారి సమీనా ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలు చేయించారు. పరీక్షల్లో మొత్తం 56 మంది విద్యార్థులు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు తేలింది. అలాగే పలువురు కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యుల దృష్టికి తీసుకొచ్చారు. వారికి మందులు అందజేశారు.
నిలకడగా విద్యార్థి ఆరోగ్యం
అస్వస్థతకు గురైన విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్‌వో ప్రమోద్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి చేతిపై ఉన్న గీర్లు చీమలు కరిస్తే వచ్చిన గీర్లలా గా ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు.
విద్యార్థికి నీరసం, కుడిచేతిలో నొప్పి, కళ్లు తిరగడం
కోరుట్ల ఆసుపత్రిలో చికిత్స
ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్


