25 రోజులకు ఇంటికి చేరిన మృతదేహం
గన్నేరువరం: గల్ఫ్‌లో మృతి చెందిన లింగంపల్లి మొండయ్య మృతదేహం 25రోజులకు శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మొండయ్య 17ఏళ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. ఆనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 3వ తేదీన అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కొడుకు క్రాంతి, గ్రామ మాజీ సర్పంచ్ సొల్లు అజయ్‌వర్మ, రజక సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక రమేశ్ మార్చి 5న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ని కలిశారు. ఆయన చొరవతో 25రోజుల నిరీక్షణ అనంతరం మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలకు గ్రామస్తులతో సమీప గ్రామ ప్రజలు తరలివచ్చారు.


