విద్యుత్ తీగను పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: వెన్ను నొప్పి భరించలేక మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ తీగను పట్టుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. రాయపట్నం గ్రామానికి చెందిన గొల్ల సత్తయ్య(48) ఐదేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య శరణ్యమని భావించి ఇంటి ఎదుట ఉన్న ట్రాన్ఫ్‌ఫార్మర్ వైరును పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతానికి గురైన కూలీలు
పెద్దపల్లిరూరల్: చీకురాయి గ్రామ సమీపంలో కొనసాగుతున్న రైల్వేలైన్ బైపాస్ పనులు చేస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కూలీలు గోవింద్‌కుమార్, బ్రిజేశ్‌కుమార్‌ను సదరు కాంట్రాక్టర్ గోప్యంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాంట్రాక్టర్ తన నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
వైరస్‌తో కోళ్ల మృతి
గంగాధర: గంగాధర మండలంలోని లక్ష్మిదేవిపల్లి శివారులోని కోళ్లఫారంలో వైరస్‌సోకి శుక్రవారం వందలాది కోళ్లు మృతి చెందాయి. వాతావరణంలో మార్పులతో పాటు, ఆర్డీ వైరస్‌తో కోళ్లు మృతి చెందుతున్నాయని ఫారం యజమాని ఇప్పలపల్లి నర్సయ్య పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఐదారువేల కోల్లు మృతి చెందాయన్నాడు. ఐఎల్‌టీ, వీవీఎన్‌డీ వైరస్ సోకడంతో ప్రస్తుతం కోళ్లు మృతి చెందుతున్నాయని పశువైద్యాధికారి సందీప్‌రెడ్డి తెలిపారు.
కోరుట్లలో సినీ ఫక్కీలో చోరీ
కోరుట్ల: పట్టణంలోని అయిలాపూర్ రోడ్డుకు ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినీ ఫక్కీలో జరిగిన ఘటనలో దుండగులు రూ.1.50 లక్షలు చోరీ చేసి బైక్‌పై పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. అయిలాపూర్‌కు చెందిన చింతకింది శ్రీహరి శుక్రవారం బ్యాంకు నుంచి రూ,1.50 లక్షలు డ్రా చేసి తన బైక్‌లోని ట్యాంక్ కవర్ ఉంచాడు. తను పార్క్ చేసిన బైక్ వద్ద మరో బైక్ ఉండటంతో బైక్‌ను జరిపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రూ.100 నోటును పడవేశాడు. మీనోటు పడిపోయింది చూడట్లేదా? అని శ్రీహరితో అనటంతో ఆ వంద నోటు తీసుకునేందుకు శ్రీహరి కిందికి వంగాడు. అదే క్రమంలో బైక్ ట్యాంకు కవర్‌లో ఉన్న రూ.1.50 లక్షల నగదును ఇద్దరు దుండగులు తీసుకొని బైక్ పై పారిపోయారు. దుండగులు పారిపోతున్న దృశ్యాలు పట్టణంలోని సీసీ కెమెరాల్లో కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగను పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
విద్యుత్ తీగను పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య


