● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పలు రిజర్వాయర్లను సందర్శించి, నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలీన గ్రామాలతో పాటు నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా వేసవి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిర్ణీత వేళల్లో తాగునీటి సరఫరా చేయాలని, సరఫరా సమయంలో సిబ్బంది పర్యవేక్షణ తప్పని సరి అన్నారు. డీఈ, ఏఈస్థాయి అధికారులు కూడా నీటి సరఫరా సమయంలో పర్యవేక్షించాలన్నారు. నగరపాలకసంస్థ నీటి సరఫరా కన్నా, విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రిజర్వాయర్ల వారీగా లీకేజీలు గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. రా వాటర్ సేకరణలో ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోజురోజుకు ఎల్‌ఎండీలో నీటిమట్టం తగ్గుతుండడంతో, బూస్టర్లను నడిపించి రా వాటర్ తీసుకోవాలన్నారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ కౌంటర్ల పరిశీలన
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఎల్‌ఆర్‌ఎస్ కౌంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ఆన్‌లైన్ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.


