ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం
● బల్దియా ఎదుట యూత్ కాంగ్రెస్ నిరసన
కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలోని 14వ డివిజన్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజీమ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డివిజన్‌లో ఏర్పాటు చేసిన దాదాపు 150 ఫ్లెక్సీలను సోమవారం నగరపాలకసంస్థ డిజాస్టర్ సిబ్బంది తొలగించారు. దీంతో అజీమ్ ఆధ్వర్యంలో నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. డివిజన్‌లో ఎన్నో ఫ్లెక్సీలు ఉండగా, తన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడానికి కారణమేమిటో అధికారులు చెప్పాలంటూ అజీమ్ నిలదీశారు. రంజాన్ పండుగ రోజే తమ ఫ్లెక్సీలు తొలగించడం మైనార్టీల పట్ల వివక్షే అంటూ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. కాగా, ఫ్లెక్సీల తొలగింపు తమ దృష్టికి రాలేదని, సిబ్బంది తెలియక చేసిన పొరపాటంటూ అక్కడికొచ్చిన అధికారులు సర్ది చెప్పారు. అయితే డివిజన్‌లో యథావిధిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.


