రూ.86కోట్లు.. 12 అంతస్తులు
సిరిసిల్లకల్చరల్:
మారుతున్న పరిస్థితులు.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా జిల్లాలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు సరిపోవడం లేదు. కక్షిదారులు, లాయర్లు, పోలీసులు, నిందితుల బంధువులతో కోర్టు ఏరియా రద్దీగా మారుతోంది. ప్రస్తుతం జిల్లా కోర్టులు ఉన్న ప్రాంతంలోనే నూతన భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 5.1 ఎకరాలలో రూ.86కోట్లతో 12 అంతస్తుల్లో భవన సముదాయం నిర్మించాలని ఏర్పాట్లు చేస్తుంది. రానున్న జూలైలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భవనం పనులు పూర్తయ్యే వరకు కోర్టు వ్యవహారాలు తాత్కాళికంగా ప్రైవేట్ భవనంలో నిర్వహించేందుకు సైతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
నెల రోజుల్లోనే టెండర్లు
సిరిసిల్లలో కోర్టు భవనాలకు నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశాలమైన కోర్టు హాళ్లు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, తగినన్ని వాష్‌రూమ్స్, భవనానికి నాలుగు వైపులా పార్కింగ్ సౌకర్యంతో అధునాతనంగా నిర్మించనున్నారు .
సర్దార్‌నగర్‌లో తాత్కాలిక కోర్టు
నూతన భవన నిర్మాణం ప్రతిపాదన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు కాంప్లెక్స్ మరో చోటికి తరలిపోనుంది. సర్దార్‌నగర్‌లో మూడు అంతస్తుల ప్రైవేట్ భవనాన్ని తాత్కాలిక న్యాయస్థానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో తాత్కాలిక భవనం రూపుదిద్దుకోనుంది. జూన్ మూడో వారం నాటికి ప్రైవేట్ భవనంలో కోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.
అక్కడ మూడు..ఇక్కడ మూడు
ప్రస్తుత కోర్టుల సముదాయంలోని మూడు కోర్టులు ప్రైవేట్ భవనంలోకి వెళ్లనున్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు ప్రైవేట్ భవనంలో కొనసాగుతాయి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సినారె కళామందిరం సమీపంలో నిర్వహించనున్నారు. ఇక ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు, మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, పోక్సో కోర్టులతోపాటు న్యాయస్థాన పాలనాపరమైన కార్యాలయాలు మాత్రం పూర్వపు భవనాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు కోసం
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణకు అవకాశం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పుడు ఉన్న ఏడు కోర్టులతోపాటు అదనంగా అట్రాసిటీ కేసుల విచారణ కోసం మరో న్యాయస్థానం అవసరం ఉంది. ఈమేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు నూతనంగా ఏర్పడ్డ న్యాయవాదుల సంఘం ప్రయత్నిస్తోంది. సోమవారం ఈ ప్రతిపాదనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లాకు నూతన కోర్టు భవన సముదాయం
ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మాణం
ఐదు ఎకరాల్లో సువిశాల భవనం
జూలై నుంచి పనులు మొదలు
కొత్త జిల్లాల్లో తొలి న్యాయస్థానం సిరిసిల్లలోనే..
రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో అదనంగా 23 జిల్లాల్లో తొలి న్యాయస్థానం సిరిసిల్ల్లకే కేటాయించారు. అప్పటి ఎంపీ వినోద్‌కుమార్, మంత్రి కేటీఆర్‌తో చర్చించి జిల్లా ఏర్పడిన తొలి ఆరు నెలల్లోపే జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేసుకోగలిగాం. నూతన భవనాన్ని కూడా ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు హైకోర్టు, ఆర్థిక, భవన నిర్మాణశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటాం. న్యాయవాదులకు దాదాపు ఏడేళ్లుగా కొత్తగా హెల్త్‌కార్డులు జారీ కాలేదు. రాష్ట్రంలో సుమారు 35వేల మంది, జిల్లా కేంద్రంలో 180 మంది న్యాయవాదులకు త్వరలోనే ఆరోగ్య కార్డులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను.
– జూపల్లి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
రూ.86కోట్లు.. 12 అంతస్తులు


