గ్రామ పాలనకు కసరత్తు
● మళ్లీ ఆప్షన్లకు ఈ నెల 16వరకు అవకాశం ● వీఎల్వో సేవలకు పోటాపోటీ ● జిల్లాలో 600కు పైగా ఆశావహులు
కరీంనగర్ అర్బన్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా మరో అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వరకు అవకాశమివ్వగా మరోసారి దరఖాస్తు చేయాలని నిర్దేశించింది. రెవెన్యూశాఖలో కీలకమైన వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వీఎల్‌వో పేరుతో రెవెన్యూశాఖకు జవసత్వాలిచ్చేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. విలేజ్ లెవల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్‌కు ఆదేశాలు రాగా ఇప్పటికే ఆన్‌లైన్ ఆప్షన్లను స్వీకరించారు. ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వో, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూలో కొనసాగించనుండగా సదరు ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. ఇతరశాఖల్లో సర్దుబాటుకు ముందు జిల్లాలో 658 మంది వీఆర్‌ఏలు, 350 మంది వీఆర్వోలు ఉండేవారు. గూగుల్‌లో ఆప్షన్ ఫారం అందుబాటులో ఉంచగా ఆసక్తిగలవారు తమ వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలుండగా ఐదు మునిసిపాలిటీలున్నాయి. పోటీ ఎక్కువగా ఉండగా ఎవరిని సదరు పోస్టులో కొనసాగిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది.
స్థానికత ఎక్కడ.. విద్యార్హత ఏంటీ
డిగ్రీ లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. మొదట పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకే అవకాశం ఉండగా వీఆర్‌ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లుగా లేదా రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటారు. సీసీఎల్‌ఏ పరిధిలో ఎంపిక చేసి జిల్లాకు కేటాయింపులు చేస్తారని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి వివరించారు. కాగా ఫారంలో పుట్టిన తేదీ, విద్యార్హత, స్థానికత ఎక్కడ, ప్రస్తుతం ఏ జిల్లాలో పని చేస్తున్నారు, ఏ శాఖలో ఉన్నారు, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఐడీ నంబర్, ఎప్పుడు రెగ్యులర్ అయింది, ఎప్పుడు నియామకమయ్యారు, సదరు ప్రతిని అప్‌లోడ్ చేయాలనే ఆప్షన్లు ఉన్నాయి.
దాదాపు విధులు ఇవే
వీఆర్వోలు, వీఆర్‌ఏలు ప్రస్తుతం వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్‌వోలను పంచాయతీరాజ్, మునిసిపల్, నీటిపారుదల శాఖకు కేటాయించగా వీఆర్‌ఏలను మిషన్ భగీరథ, మున్సిపల్, నీటిపారుదల శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామ పాలన అధికారులకు వివిధ రకాల విధులు ఉండనున్నాయని సమాచారం. ఇదిలాఉండగా 61ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సర్దుబాటైన వీఆర్వో, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో కొనసాగించే ప్రక్రియ చేపడుతుండగా వీరి విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 80కి పైగా 61 సంవత్సరాలు పైబడినవారుండగా ఇందులో కొందరు మరణించగా పలువురు మంచంపట్టారు.
ఇప్పటికే ఆప్షన్లు
ఇచ్చినవారు: 605
వీఆర్వో కేటగిరీ: 254
వీఆర్‌ఏ కేటగిరీ: 351


