29 మంది బదులు వర్కర్ల నియామకం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో తాత్కాలిక పద్ధతిలో 29మంది బదులు వర్కర్లను నియమించారు. ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వర్కర్లకు బదులుగా అర్హులైన వారి కుటుంబ సభ్యులను నియమించాలనే డిమాండ్ కొంతకాలంగా ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవహారాన్ని తేల్చేందుకు ఫోర్‌మెన్ కమిటీని కమిషనర్ నియమించగా, ఆ కమిటీ వర్కర్ల అనారోగ్యం నిజమేనా, వారి కుటుంబసభ్యులు అర్హులేనా అనే అంశాలపై విచారణ చేపట్టింది. విచారణ పూర్తి కావడంతో 29 మందికి బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తాత్కాలిక నియామక పత్రాలు అందజేశారు. దరఖాస్తు పెట్టుకున్న మరికొంతమంది వర్కర్లపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్ పాల్గొన్నారు.
రికార్డు విభాగం తనిఖీ
నగరపాలకసంస్థ కార్యాలయంలోని రికార్డు విభాగాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ బుధవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సెక్షన్ ఇన్‌చార్జి నుంచి వివరాలు సేకరించారు.


