కాజీపేట– దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కుంభమేళా సందర్భంగా కాజీపేట నుంచి ముంబాయిలోని దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు నడిచే వారాంతపు రైలు రద్దు చేయగా, తిరిగి మూడు నెలల తరువాత ఈనెల 12 నుంచి పునరుద్ధరిస్తున్నారు. ప్రతి శనివారం కాజీపేట నుంచి ఉదయం 11.30కి బయలుదేరే ఈ ట్రైన్ జమ్మికుంట, పెద్దపల్లి మీదుగా వయా బాల్లార్షా– ఆదిలాబాద్–నాందేడు నుంచి దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3.25కు దాదర్ రైల్వేస్టేషన్ నుంచి కాజీపేటకు చేరుకోనుంది. పెద్దపల్లి, జమ్మికుంటలో సదరు ట్రైన్‌కు రన్నింగ్ స్టాప్ సదుపాయం కల్పించటంతో ఉమ్మడి జిల్లాప్రజలకు ఉపయోగకరంగా మారనుంది.
నిజామాబాద్– దాదర్ రైలు పునరుద్ధరణ ఎప్పుడో?
రెండు మార్గాలల్లో దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కాజీపేట నుంచి రైలు నడవగా కుంభమేళా సందర్భంగా మూడు నెలల క్రితం రైల్లు రద్దు చేశారు. తాజాగా పెద్దపల్లి నుంచి వెళ్లే వారాంతపు రైలును పునరుద్ధరిస్తున్నా రైల్వే శాఖ, నిజామాబాద్ నుంచి వయా నాందేడ్ మీదుగా ప్రయాణించే వారాంతరపు రైలును సైతం పునరుద్ధరిస్తే 200కిలోమీటర్ల దూరం తగ్గటంతో పాటు, సమయం, రైలు చార్జీలు కలిసివస్తాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ ప్రాంత ఎంపీలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
కరీంనగర్‌స్పోర్ట్స్: కర్ణాటక రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నమ్మ బెంగళూరు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ బీ కేటగిరీ ఫిడే రేటింగ్ చదరంగ పోటీల్లో కరీంనగర్‌లోని విశ్వనాథ్ చెస్ అకాడమీ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు అకాడమీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్ తెలపారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 13 వరకు బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నట్లు తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో 10 రౌండ్ల పాటు జరిగే ఈ పోటిల్లో అకాడమీ నుంచి కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్, చిట్టుమల్ల కశ్యప్, బాలసంకుల అమన్ రామ్, డి.అక్షిత్, ఈగ లిఖిత్ చైతన్య, బత్తిని శ్రీహన్, గంట అభయ్‌రామ్, కనుకుంట్ల అకీరా, ఈగ శివ చైతన్య పాల్గొంటున్నారని తెలిపారు.


