ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామ పరిధిలో శనివారం ట్రాక్టర్, కారు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యారు. ఎస్సై చంద్రకుమార్, స్థానికుల కథనం ప్రకారం.. మహదేవపూర్ మండల సూరారం గ్రామానికి చెందిన ములకల్ల ఆశాలు కుటుంబసభ్యులతో కలిసి కారులో కొండగట్టు వెళ్లి తిరిగి మహదేవపూర్ వెళ్తున్నాడు. కల్వచర్ల వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎదురుగా సెంటినరీకాలనీ నుంచి పెద్దపల్లి వెళ్తున్న బ్లేడ్ ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఆశాలు, భార్య సువర్ణ, కూతురు సుజాత, అల్లుడు రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణ తల్లి రమాదేవికి సైతం గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తండ్రిని చంపిన తనయుడి రిమాండ్: సీఐ శ్రీనివాస్‌గౌడ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన కుంచెపు కనకయ్యను కర్రతో కొట్టి చంపి పరారీలో ఉన్న అతని తనయుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఠాణాలో శనివారం కేసు వివరాలను సీఐ శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితుడు కుంచెపు పర్శరాములు ఎల్లారెడ్డిపేటకు వచ్చినట్లు తెలుసుకుని గాలించామన్నారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. తండ్రి మందలించాడని ఆవేశంతో కన్న తండ్రినే హత్య చేసిన నిందితుడిని పట్టుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు. వెంటనే రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో సహకరించిన ఎస్సై రమాకాంత్, సిబ్బందిని సీఐ అభినందించారు.
భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య
● క్షణికావేశంలో జైలులో కొడుకు
● ప్రాణాలు కోల్పోయిన భర్త
● ఒంటరైన మహిళ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కడుపున పుట్టిన కొడుకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే కాలయముడిగా మారి కన్నతండ్రి ప్రాణాలు తీసి జైలుపాలయ్యాడు. కట్టుకున్న భర్త అంత్యక్రియలు భార్య నిర్వహించిన ఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుంది. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన కుంచెపు కనకయ్య(50) శుక్రవారం కన్నకొడుకు పర్శరాములు చేతిలో హతమైన విషయం తెలిసిందే. తండ్రి మృతికి కారణమైన కుమారుడు కుంచెపు పర్శరాములును పోలీసులు జైలుకు పంపించారు. కనకయ్య అంత్యక్రియలను అతని భార్య దేవవ్వ నిర్వహించడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు
ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు


