రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
● తగలబడిన ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం
● 85 వేల గన్నీ సంచులు దగ్ధం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల శివారులోని మహలక్ష్మీ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మిల్లులో నిల్వ చేసిన ధాన్యం, గన్నీ సంచులు దగ్ధమైనట్లు రైస్‌మిల్ యజమాని గంగారెడ్డి తెలిపారు. శనివారం వేకువజామున మిల్లులో మంటలు చెలరేగుతున్నట్లు అందులో పనిచేసే ఓ కార్మికుడు యజమాని గంగారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న ఆయన మంటలను గమనించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డీసీఎస్ జితేందర్‌రెడ్డి, డీటీసీఎస్ ఉమాపతి, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రాజేందర్‌రావు, అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్, ఆర్‌ఐ ఉమేశ్, పోలీసులు రైస్‌మిల్లు వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలతోపాటు నష్టంపై ఆరా తీశారు. మిల్లులో దాదాపు 20 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం నిల్వ ఉంది. అందులోంచి సుమారు 5 వేల క్వింటాళ్ల ధాన్యం, 85 వేల గన్నీ సంచులు దగ్ధమైనట్లు యజమాని అధికారులకు తెలిపారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది.


