హై కమాండ్‌కు చెప్పుకుందాం
● కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ల ప్రత్యేక భేటీ
కరీంనగర్ కార్పొరేషన్: ‘పార్లమెంట్ ఎన్నికలకు ముందు మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు. వచ్చాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార కాంగ్రెసోళ్లమైనా మున్సిపల్ కార్పొరేషన్‌లో పనులయితలేవు. అధికారులను బదిలీ చేయించే శక్తి మాకు లేకుండా పోయింది. కనీసం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు కూడా మా డివిజన్లలో ఎవరెవరో పంచుతున్నరు. పార్టీలో మా పరిస్థితి ఏమిటో మాకే అర్థం కావడం లేదు.’.. అంటూ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలి చాల రాజేందర్‌రావు ఎదుట తమ బాధలను ఏకరువు పెట్టారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయంలో వెలిచాల రాజేందర్‌రావు శనివారం పూజా కార్యక్రమం నిర్వహించా రు. అనంతరం‘కారా?..కమలమా?’ అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం వచ్చిన కథనం నేపథ్యంలో ఆయన మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ కార్పొరేటర్లు వెలిచాల దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారన్నది ప్రస్తుతానికి పక్కనపెడితే, పార్టీపై అసంతృప్తిగా ఉండడం వాస్తవమంటూ అంగీకరించారు. నగరపాలకసంస్థ ఎన్నికలు ముందున్నందున ఇలాంటి పరిస్థితి పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే ‘పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్దాం. పరిస్థితిలో మార్పు వస్తుందనుకొంటున్నాం. రాకపోతే అందరు రాజీనామా చేస్తే వాళ్లే వింటరు’.. అంటూ ఓ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి, పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లాలని, తమ బాధలేంటో చెప్పుకోవాలని తీర్మాణించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భేటీలో మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, ఆకుల నర్సయ్య, పిట్టల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, ఆకుల ప్రకాశ్, కోటగిరి భూమాగౌడ్, నడిపెల్లి అశోక్‌రావు పాల్గొన్నారు.


