తాగునీటి సమస్యకు చెక్
● నీటి ఎద్దడి నియంత్రణకు చర్యలు ● జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు ● 24 గ్రామాల్లో అద్దెకు వ్యవసాయ బావులు
కరీంనగర్‌రూరల్: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఈ క్రమంలో వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న పనులపై గైడ్‌లైన్స్ జారీ కాగా.. మిషన్ భగీరథ అధికారులు కసరత్తు చేపట్టారు.
నీటి ఎద్దడి ప్రాంతాలు ఇవే..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 318 గ్రామపంచాయతీలు, 464 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. చొప్పదండి, గంగాధర, గన్నేరువరం మండలాలకు మిషన్ భగీరథ నీరు సరిపడా రావడంలేదు. కరీంనగర్ మండలంలో నగునూరు, ఎలబోతారం, ఫకీర్‌పేట, కొత్తపల్లి మండలంలో ఖాజీపూర్, మానకొండూరు మండలంలో బంజేరుపల్లి, జగ్గయ్యపల్లె, రంగపేట, వెల్ది, రామడుగు మండలంలో రామడుగు, వెంకట్రావుపల్లి, గోపాల్‌రావుపేట గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాగునీటి ఎద్దడి నియంత్రణకు రూ.1.8కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది.
అద్దెకు వ్యవసాయబావులు
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తిచేసిన రైతులను సంప్రదించి అందుబాటులో ఉన్న వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుంటున్నారు. జిల్లాలో సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, అమ్మనగుర్తి, జాగిరిపల్లి, గొడిశాల, గుజ్జులపల్లి, ఎలబోతారం, రాంచంద్రపూర్, శివరాంపల్లి, చిగురుమామిడి మండలం నవాబ్‌పేట, కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి, హన్మాజీపల్లి, మానకొండూరు మండలం పెద్దబంజేరుపల్లి, జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లె, గండ్రపల్లె, శంభునిపల్లె, ఇల్లందకుంట మండలం పతార్లపల్లె, వీణవంక మండలం కొండపాక, కోర్కల్, చొప్పదండి మండలం గుమ్లాపూర్, గుంటూరుపల్లి, గంగాధర మండలం నర్సింహులపల్లి, సర్వారెడ్డిపల్లి, గర్షకుర్తి గ్రామాల్లో బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
మరమ్మతుకు జెడ్పీ నిధులు
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నియంత్రణకు జెడ్పీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్తపైపులైన్ల నిర్మాణం, పైపులైన్లు, బోర్ల మరమ్మతు తదితర పనులు చేపడతారు. సైదాపూర్ మండలంలో ఆరు పనులకు రూ.8లక్షలు, శంకరపట్నం మండలంలో 12 పనులకు రూ.19.4లక్షలు, గన్నేరువరం మండలంలో 10 పనులకు రూ.16.70 లక్షలు, మానకొండూరులో 8 పనులకు రూ.48.15 లక్షలు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఈ నిధులతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అద్దె బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.
– టి. అంజన్‌రావు, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్
తాగునీటి సమస్యకు చెక్


