ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్
వేములవాడ: ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్‌గా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రెస్‌క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు పాత్రికేయ మిత్రులతో 1987 నుంచి అనుబంధం ఉందని, ఒకప్పుడు రుద్రంగి నుంచి వేములవాడకు వచ్చి వార్తలు అందించిన మిత్రులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాతో మంచి, చెడు రెండు ఉంటున్నాయన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్తలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వేములవాడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏఐతో పొంచి ఉన్న ముప్పు
– ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
పత్రికరంగంలో మార్పులు వస్తూనే ఉన్నాయని.. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్.. ఆతర్వాత సోషల్‌మీడియా వచ్చిందని.. ఇప్పుడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో మరించి ముప్పు పొంచి ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి మాట్లాడినట్లు వీడియోలు వైరల్ చేస్తూ హైరానా సృష్టించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏఐ, దాని పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించామని, త్వరలోనే వేములవాడలో రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐజేయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ వేములవాడ ప్రెస్‌క్లబ్ ముందు నుంచి అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
పాత్రికేయులు ప్రజాసేవకులు
కరోనా తర్వాత పాత్రికేయ రంగం మారింది
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో కలిసి ప్రెస్‌క్లబ్ సమావేశ మందిరం ప్రారంభం


