గ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు
కరీంనగర్: గ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాదాపు 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్‌లో సమానంగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. రాముల్‌నాయక్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ మల్టీజోన్‌లో నంబర్–1 ర్యాంక్ రాములునాయక్ కొడలికి వచ్చిందన్నారు. తన కోడలు పద్దెనిమిది గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పగా... ఆ అమ్మాయి మాత్రం కేవలం ఐదు గంటలే చదివానని చెప్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియడం లేదన్నారు. రాముల్‌నాయక్ కోడలుకు గాంధీభవన్ నుంచి ముందే పరీక్ష పేపర్ వచ్చిందని ఆరోపణలు చేశారు. కోఠి ఉమెన్స్ కళాశాలలో ఎగ్జామ్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఒకమ్మాయి రీకౌంటింగ్ అడిగితే 60 మార్కులు తగ్గాయన్నారు. కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్కాంల ప్రభుత్వమని దుయ్యబట్టారు. బండిసంజయ్ ఈ అంశంపై ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డితో లాలుచీ ఉండడంతోనే ఎవరూ మాట్లడడం లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉంటే.. తమకు కూడా ఉద్యోగాలు వచ్చేవని.. తమకు న్యాయం చేయాలని చాలా మంది బాధితులు తమ వద్దకు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేస్తున్న సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించి జ్యుడీషియల్ ఎంక్వయిరీ గాని, కేంద్ర విజిలెన్స్ ద్వారా గానీ లేదా సీబీఐ ఎంక్వయిరీ వేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీబీఐతో విచారణ చేపట్టాలి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి


