● మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమారం గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సైదాపూర్‌లో సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దొంత సుధాకర్ అధ్యక్షతన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నచోట సన్నబియ్యం ఎందుకు ఇవ్వడంలేదని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు దమ్ములేదా? అని నిలదీశారు. తూకంలో కోత పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్‌ను ఆదేశించారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఇల్లు లేనిప్రతీ పేద కుటుంబానికి రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, ఎల్‌ఎస్‌సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో యాదగిరి, మార్కెట్ కమిటీ, సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


