రేబిస్‌.. ప్రాణాంతకం | - | Sakshi
Sakshi News home page

రేబిస్‌.. ప్రాణాంతకం

Sep 28 2025 7:08 AM | Updated on Sep 28 2025 7:08 AM

రేబిస్‌.. ప్రాణాంతకం

రేబిస్‌.. ప్రాణాంతకం

కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు

అవగాహన, అప్రమత్తత అవసరం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకాలు

నేడు రేబిస్‌ నివారణ దినోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారానికి చెందిన ముత్తు బోయిన సందీప్‌(25) తండ్రిని నెలన్నర క్రితం పెంపుడు కుక్క కరిచింది. ఆయనకు చికిత్స చేయించాడు. దూరంగా వదిలేసేందుకు ఓ సంచిలో పెట్టుకుని వెళ్తుండగా కుక్క కాలిగోటితో గీరింది. వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో నరాల బలహీనతతోపాటు రేబిస్‌ లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. రేబిస్‌ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే ఈనెల 23న సందీప్‌ మృతి చెందాడు. సకాలంలో వైద్యం తీసుకుంటే యువకుడు బతికేవాడని డాక్టర్లు తెలిపారు.

కోల్‌సిటీ(రామగుండం): విశ్వాసం ప్రదర్శించడంలో కుక్కకు మించిన ప్రాణి మరోటిలేదంటారు. అందుకే కొందరు వాటిని ఇంటికి రక్షణగా, మరికొందరు తోడుగా ఉంటుందని పెంచుకుంటున్నారు. వీటితోపాటు వీధికుక్కలు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంచరిస్తూ దొరికిన ఆహారం తింటూ బతుకుతున్నాయి. కొన్నిసార్లు తమకు ప్రమాదం తెస్తున్నారని భావించి మనుషులను కరుస్తుంటాయి. ఈ కాటుతో రేబిస్‌ సోకి ఒక్కోసారి ప్రాణాపాయం తెస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్‌ నివారణకు ఉపయోగించే, ఉచితంగా లభించే ఏఆర్‌వీ టీకాలు ఉన్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాటు వైద్యం వైపు మొగ్గుచూపుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. లూయీస్‌ ప్యాక్చర్‌ అనే ప్రముఖ శాస్త్రవేత్త రేబీస్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. ప్రజలకు రేబిస్‌పై అవగాహన కల్పించడానికి, లూయీస్‌ ప్యాక్చర్‌ జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబర్‌ 28న వరల్డ్‌ రేబిస్‌ డేగా నిర్వహిస్తున్నారు.

కుక్కలతో భద్రం..

రేబిస్‌తో బాధపడే కుక్కలు పుండ్లు, గాయం ఉన్నచోట నాకినా, కొరికినా మనుషులకు వ్యాధి సోకుతుంది. రేబిస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి. ముఖ్యంగా కుక్కలు, కోతులు, పెంపుడు జంతువులు మనుషులను కరవడం, గీకడం ద్వారా రేబిస్‌ వ్యాపిస్తుంది. కరిచిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాధి బహిర్గతమవుతుంది. అయితే కుక్క ఎక్కడ కరిచింది? ఎంతో లోతు గాయమైంది. వైరస్‌ శరీరంలోకి ఎంతమేరకు ప్రవేశించిందనే దానిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ కండరాల్లోంచి నరాల ద్వారా మెదడులోకి వెళ్తుంది. కణాల సముదాయంలోకి, ఎముకలు, గ్రంథుల్లోకి వెళ్లి లాలాజలంలో ప్రవేశిస్తుంది. స్కిన్‌ బయాప్సీ, లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్ధారిస్తారు.

లక్షణాలు ఇలా ఉంటాయి..

తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, సాధారణ జ్వరం ఉంటాయి. దీంతోపాటు కుక్క కరిచిన ప్రాంతంలో నొప్పి పెరుగుతుంది. ఈ లక్షణాల తర్వాత వైరస్‌ మెదడును తీవ్రమైన ఉద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గాలికి భయపడతారు. నీళ్లను చూసినా వణికిపోతారు. గొంతులోని కండరాలు బిగుసుకుపోతాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. క్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

జాగ్రత్తలు తప్పనిసరి

కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా వెంటనే యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌(ఏఆర్‌వీ) వేయించుకోవాలి. వీరికి మొదటి, మూడు, ఏడో, 14వ, 28వ రోజుల్లో వ్యాక్సిన్‌ వేస్తారు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి మొదడు వరకు చేరకుండా అడ్డుకోవడానికి అవసరమైన వారికి పీఈపీ టీకాలను కూడా వేస్తారు. కుక్కే కాదు.. పంది, పందికొక్కులు, కోతులు, గాడిదలు, గుర్రాలు, గబ్బిలాలు, ఎలుకలు, పిల్లులు వంటివి కరిచినా ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, సకాంలో చికిత్స తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement