
నేడు సద్దుల బతుకమ్మ
కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. మహిళలంతా ఒక చోట చేరి ఆనందంగా గడిపే పండుగ. పెత్రమావాస్య నుంచి మొదలై దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలంతా కలిసి బతుకమ్మను దగ్గరలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కథనం.
పూలు.. పాటలు.. ప్రసాదం
ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీతజడ పూలతో బతుకమ్మను పేర్చుతారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకం ప్రసాదం తయారు చేస్తారు. చివరిరోజు ఆడిపాడిన తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువు వద్దకు వెళ్లేటప్పుడు ప్రసాదంగా నువ్వులు, పల్లీలతో సత్తుపిండి, తులసీ దళాలు మొదలైనవి తీసుకెళ్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం ఒకరికొకరు సత్తుపిండితో పాటు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ పండుగలో పూలకెంత ప్రాధాన్యం ఉందో పాటలకూ అంతే ఉంది. బతుకమ్మ పాటలన్నీ సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలితో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైనవి. వీటిలోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, చార్రితక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటల్లో ప్రధాన వస్తువులు.
చివరి రోజు రెండు బతుకమ్మలు
తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పడు తోడు పెళ్లి కూతురుగా మరొకరిని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మ పండుగలోనూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు.