
ఇంటర్వ్యూకి వెళ్లి అనంతలోకాలకు..
● రైలు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
వీణవంక(హుజూరాబాద్): ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలకేంద్రానికి చెందిన గడ్డం సాయికృష్ణ(29)హైదరాబాద్‌లో సీఏ పూర్తి చేశాడు. రెండురోజుల క్రితం ఓ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడి నుంచి ఓ ఫంక్షన్ కోసం శనివారం విజయనగరానికి రైలులో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబీకులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. కాగా ఇంటర్వ్యూ వద్దని తల్లిదండ్రులు చెప్పినా జాబ్ కోసమని వెళ్లిన చయువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
కోతులను వెళ్లగొట్టబోయి వ్యక్తి..
కోనరావుపేట(వేములవాడ): కోతులను వెళ్లగొట్టే క్రమంలో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఇంటి వద్ద ఉండగా కోతుల గుంపు ఇంటిపైకి రావడంతో వాటిని వెళ్లగొట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా అవి మీదకి రావడంతో గట్టిగా కేకవేసి కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని నెలలుగా కోతులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, కోతుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఒకరి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని హుస్సేనిపురకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసులె తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనిపురకు చెందిన షేక్ ముజాయిద్ హుస్సెన్(52)కు భార్య మసేహా సుల్తానా, కూతురు, కొడుకున్నారు. రెగ్జిన్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 26వ తేదీన పెద్దపల్లిలో బంధువులు శుభకార్యానికి ముగ్గురు వెళ్లారు. షేక్ ముజాహిద్ హుస్సెన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. 27వ తేదీన ఉదయం ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.