
బాలసదన్ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని క్రిస్టియన్ కాలనీలో నిర్మిస్తున్న బాలసదన్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి బాలసదన్ పనులను పరిశీలించారు. అలాగే నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని నర్సరీని సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
రూ. కోటితో షెడ్
నగరపాలకసంస్థ వాహనాలు నిలిపి ఉంచేందుకు రూ.1 కోటితో షెడ్ నిర్మాణం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న సప్తగిరికాలనీ వాహనాల షెడ్‌కు అదనంగా, నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలో షెడ్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. ప్రతిపాదిత స్థలాన్ని కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం విజయదశమి పండుగను పురస్కరించుకొని నగరపాలకసంస్థ వాహనాలకు కలెక్టర్, కమిషనర్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): విజయదశమి సందర్భంగా గురువారం కరీంనగర్ నగునూర్‌లోని పరివార సమేత శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగళ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి వాహనపూజ, శ్రీచక్రపూజ, చతుషష్ట్యుపచార పూజ, 8.30 గంటలకు అమ్మవారికి విశేష హారతి, గంగా హారతి, సాయంత్రం 4గంటలకు జమ్మిపూజ, రాత్రి 7గంటలకు రాంలీల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పదోన్నతుల ‘పండుగ’
కరీంనగర్ అర్బన్: ఏఈవోల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దసరా పండుగ పూట తీపి కబురు చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్–1 పరిధిలో 29మంది వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)కు వ్యవసాయ అధికారులుగా పదోన్నతి కల్పించింది. జిల్లాలో నలుగురికి పదోన్నతి లభించగా ఇతర జిల్లాలకు కేటాయించారు. జిల్లాలో పున్నం చందర్ (తిమ్మాపూర్), పైడితల్లి (దుర్షేడు), కీర్తికుమార్ (గునుకుల కొండాపూర్), తిరుపతి (మల్కాపూర్) ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారులుగా పదోన్నతి లభించింది. కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఏవోలకు అదనపు బాధ్యతలు తప్పడంలేదు. తాజాగా లభించిన పదోన్నతులతో ఖాళీ పోస్టులను భర్తీచేశారు. అయితే పదోన్నతి పొందిన వారికి సొంత జిల్లాలో బాధ్యతలు కాకుండా జోన్ పరిధిలో వరంగల్, జగిత్యాల జిల్లాలకు కేటాయించగా సిరిసిల్ల జిల్లా నుంచి సంతోష్ కుమార్‌ను, జగిత్యాల నుంచి ముత్యాల రమేష్ లను జిల్లాకు అలాట్మెంట్ చేయగా కొత్తపల్లి ఏవోగా సంతోష్ కుమార్, చిగురుమామిడి ఏవోగా రమేశ్‌ను నియమించారు. ఇదిలా ఉండగా ఒకటి, రెండు రోజుల్లో ఏవోల నుంచి ఏడీఏలుగా పదోన్నతి కల్పించనున్నట్లు సమాచారం.
కరీంనగర్ సర్కిల్‌కు ర్యాంకులు
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్‌పీడీసీఎల్ కంపెనీస్థాయిలో బుధవారం ప్రకటించిన వివిధ పారా మీటర్లలో కరీంనగర్ సర్కిల్‌కు ర్యాంకులు దక్కాయి. విద్యుత్ సంస్థ కంపెనీ స్థాయిలో కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబుకు రెండో ర్యాంకు, కరీంనగర్ టౌన్ డీఈ జంపాల రాజంకు రెండో ర్యాంకు, సబ్‌డివిజన్ టౌన్–1 ఏడీఈ (ఆపరేషన్) పంజాల శ్రీనివాస్‌గౌడ్‌కు మొదటి ర్యాంకు, సబ్ డివిజన్ టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్యకు 5వ ర్యాంకు, టౌన్–3 ఏఈ (ఆపరేషన్) వెంకటరమణయ్యకు 5వ ర్యాంకు, ఉమ్మడి కరీంనగర్ సర్కిల్‌లో హుజూరాబాద్ ఏడీఈ (ఆపరేషన్) పి.శ్రీనివాస్‌కు ఒకటో ర్యాంకు, టౌన్–8 ఏఈ (ఆపరేషన్) ఫసిఅహ్మద్‌కు ఒకటో ర్యాంకు లభించింది. అత్యున్నత ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన ర్యాంకుల పట్ల సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.