
సాక్షి,బళ్లారి: మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తొలి జాబితాలో ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి ఆరుగురికి టికెట్లు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఐదుగురికి, ఒకరు మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఖరారు చేశారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, కంప్లి నుంచి గణేష్‌లకు టికెట్ ఖరారు కాగా, విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భీమానాయక్, హడగలి నుంచి పరమేశ్వర నాయక్, విజయనగర నుంచి మాజీ ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్పలకు టికెట్ ఖరారు చేశారు. ఆరు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు కాగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. బళ్లారి నగరం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో తుది జాబితాలో అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
బళ్లారి సిటీ టికెట్ ఎవరికో?
బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు పోటీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో ప్రముఖంగా టచ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, మాజీ జెడ్పీ మెంబర్ అల్లం ప్రశాంత్, మాజీ మంత్రి ఎం.దివాకర్‌బాబు పేర్లు పరిశీలనలో ఉన్నా, వీరిలో ఇద్దరి పేర్లను మాత్రమే హైకమాండ్ మరీ ముఖ్యంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తెరపైకి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేయాలని స్వయానా పోటీలో ఉన్న మాజీ మంత్రి దివాకర్‌బాబు ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందో ఇప్పట్లో తేలే అంశం కాదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇంకా ఖరారు కాని స్థానాలివే
హరపనహళ్లి నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దివంగత ఎంపీ ప్రకాష్ కుమార్తె టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిరుగుప్ప నియోజకవర్గం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు తీవ్ర పోటీ పడుతుండగా పేరును ఖరారు చేయలేకపోయారని తెలుస్తోంది. కూడ్లిగి నియోజకవర్గం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో. బీజేపీ తరపున ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారో వేచి చూసి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment