
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గం జిల్లా హిరయూరు జేడీఎస్ అభ్యర్థి రవీంద్రప్ప సతీమణి లత, ఆయన కోడలు శ్వేతలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం హిరయూరు తాలూకా ధర్మపుర సమీపంలోని మంగూసహళ్లి వద్ద ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో జేడీఎస్ అభ్యర్థి రవీంద్రప్ప, ఆయన కుమారుడు ఎన్నికల నేపథ్యంలో బయటకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఇంట్లో సోదాలు చేసిన అధికారులు వివరాలు సేకరించేందుకు వారిద్దరిని ఐటీ అధికారులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 21న కూడా ఐటీ అధికారులు రవీంద్రప్ప ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఆయనపై ఐటీ నిఘా పెట్టింది. అదే సమయంలో సోదాలు చేసిన అధికారులు ఐటీ కార్యాలయానికి హాజరు కావాలని సూచించిన అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో అధికారులు అత్తా, కోడలను అరెస్ట్ చేసి బెంగళూరు తరలించారు.
అత్త, కోడలను ఐటీ అధికారులు బెంగళూరుకు తీసుకెళ్లడంతో జేడీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖను అధికార బీజేపీ దుర్వినియోగానికి వాడుకుంటోందని విమర్శించారు. ఎన్నికలకు ఒక రోజు ముందు జేడీఎస్ అభ్యర్థి కుటుంబం సభ్యులను ఐటీ అధికారులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.