
శ్రీనివాసపురం: కోలారు జిల్లాలోని ముళబాగిలు విధానసభ క్షేత్రం అటు కర్ణాటక– ఇటు ఆంధ్రలోని చిత్తూరును ఆనుకుని రెండు ప్రాంతాల సంస్కృతికి పట్టుగొమ్మగా ఉంటోంది. ముళబాగిలు పట్టణంలోని ఆంజనేయస్వామి, తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ద వినాయక దేవస్థానం అనుగ్రహం కోసం నాయకులు తపిస్తుంటారు. తరచూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో కురుడుమలై వినాయకునికి పూజలు నిర్వహించిన తరువాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా ఉంది. ఈ ఊరు రాష్ట్రానికి తూర్పు దిక్కు వాకిలిగా ఉండడంతో ముదలబాగిలు అని స్థానికులు పిలిచేవారు, అదే క్రమంగా ముళబాగిలు అయ్యిందని కథ. పర్యాటకంగా, ఆధ్యాత్మిక క్షేత్రాల పరంగా ఎంతో పేరుపొందిన ప్రాంతమిది.
ఎస్సీ రిజర్వుడు క్షేత్రం
ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్యన ముఖాముఖి పోటీ నెలకొంది. ఇక్కడ ముందు నుంచి కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్యనే పోటీ ఉంది. ఇక ఎన్నడు గెలిచిన దాఖలా లేని బీజేపీ పోటీ ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. గత రెండు ఎన్నికలలో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులే విజయం సాధించారు. 2013లో కొత్తూరు మంజునాథ్, 2018లో హెచ్ నాగేష్ స్వతంత్రులుగా గెలవడం విశేషం.
అభ్యర్థులు వీరే
ముళబాగిలులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణ జేడీఎస్ అభ్యర్థి సమృద్ధి మంజునాథ్, బీజేపీ నుంచి సీగేహళ్లి సుందర్ బరిలో ఉన్నారు. గత 2018లో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తూరు మంజునాథ్ కుల ధృవీకరణ సర్టిఫికెట్ వివాదం కారణంగా ఆయన నామినేషన్ తిరస్కారమైంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్.నాగేష్‌కు ఆయన మద్దతు ఇచ్చి గెలిపించారు. గత ఎన్నికల్లో 6,500 ఓట్ల తేడాతో ఓడిన జేడీఎస్ అభ్యర్థి సమృద్ధి మంజునాథ్ ఈసారి ఎలాగైనా ఎన్నిక కావాలని శ్రమించారు. బీజేపీ అభ్యర్థి సీగేహళ్లి సుందర్ నామమత్రపు పోటీ ఇస్తూ భారం అంతా పార్టీ అధినాయకులపైనే వేశారు.
ఓటర్లు ఇలా
నియోజకవర్గంలో 1,07534 మంది పురుష ఓటర్లు ఉండగా, 1,09,018 మంది మహిళా ఓటర్లు, తృతీయ లింగ ఓటర్లు 11 మంది ఉన్నారు. దళితుల సంఖ్య అధికంగా ఉండి, ఒక్కలిగులు, ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు.