
సాక్షి,బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సర్వేలు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని, పోలింగ్ జరిగిన సరళిని బట్టి పరిశీలిస్తే తప్పకుండా మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆపద్ధర్మ సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
ఆయన గురువారం హుబ్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శిగ్గాంవి ప్రజలు తనపై ఎంతో విశ్వాసం చూపినందుకు వారి రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్రంలో 224 నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ గెలుపుతో మళ్లీ తామే అధికారం చేపడతామన్నారు.
గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 107 నుంచి 115 సీట్లు వస్తాయి అని సర్వేలు చెప్పినా ఏమైందని అన్నారు. ఈసారి కూడా సర్వేలు అలాగే ఉన్నాయని, బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. మోదీ ప్రచారం తర్వాత రాష్ట్రంలో తమకు మరిన్ని సీట్లు పెరిగాయన్నారు.