సాక్షి,బళ్లారి: జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. శనివారం నగరంలోని ఆర్‌వైఎంఈసీలో జరిగిన ఓట్ల లెక్కింపులో బళ్లారి సిటీ, గ్రామీణ, సిరుగుప్ప, కంప్లి, సండూరుతో సహా మొత్తం 5 నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోను కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీ పార్టీలు నువ్వా, నేనా అనేలా తలపడినా కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధించడం విశేషం.
బళ్లారి నగర కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కేఆర్‌పీపీ అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణపై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి సోమశేఖర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. బళ్లారి గ్రామీణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీ.నాగేంద్ర తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములుపై ఘన విజయం సాధించారు. కంప్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జేఎన్ గణేష్ తన సమీప ప్రత్యర్థి టీహెచ్ సురేష్‌బాబుపై గెలుపొందారు. సండూరులో కాంగ్రెస్ అభ్యర్థి తుకారాం తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థినిపై ఘన విజయం సాధించారు.
సిరుగుప్పలో కాంగ్రెస్ అభ్యర్థి బీఎం నాగరాజ్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 5 నియోజకవర్గాల్లోను బీజేపీ ఖాతా తెరవక పోవడం గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటకు ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సర్వశక్తులు ఒడ్డిన గాలి జనార్ధన రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ కూడా ఓటమి పాలయ్యారు. మొత్తం మీద కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహంతో విజయోత్సవాలు నిర్వహించారు.
కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
బళ్లారిఅర్బన్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ముఖ్యంగా హోరాహోరీగా సాగిన ఐదు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు మట్టికరిచారు. నగర అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటి సారిగా నారా భరత్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కేఆర్‌పీపీ అభ్యర్థినిపై 37,682 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బళ్లారి గ్రామీణలో యువనేత, కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర వరుస విజయాలు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములుపై నాగేంద్ర 28,947 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
కంప్లిలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి టీహెచ్ సురేష్‌బాబుపై 22,536 మెజార్టీతో రెండో సారి ఘన విజయం సాధించారు. సిరుగుప్పలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీఎం. నాగరాజ్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమలింగప్పపై 36,849 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
సండూరులో కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ.తుకారాం తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థిని శిల్పా రాఘవేంద్రపై 35,390 ఓట్ల మెజార్టీతో వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని 5 స్థానాల్లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా చిందులు వేస్తూ బాణసంచాను పేల్చి సంబరాలను జరుపుకున్నారు. విజేత అభ్యర్థులను విద్యానగర్‌లోని ఎయిర్‌పోర్ట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ గుడి వరకు ఘనంగా ఊరేగించారు.
Comments
Please login to add a commentAdd a comment