కర్ణాటక: కొడగు జిల్లాలో అరుదైన ఎలుక జ్వరం ఒకరిని పొట్టనబెట్టుకుంది. ఎలుక జ్వరం (ర్యాట్ ఫివర్) వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన మడికెరి తాలూకాలోని కెరికె గ్రామంలో జరిగింది. గ్రామానికి దగ్గర ఉన్న చంబేరి అనెపారె ప్రాంతానికి చెందిన యువకుడు లిబీన్‌కు ఎలుక జ్వరం సోకింది. స్థానిక కూలి కార్మికుడు బాలన్ కుమారుడు ఆయిన లిబీన్ కేరళలో ఉన్న పెరియారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా కామెర్లు సోకినట్లు వైద్యులు తెలిపారు. తరువాత మరిన్ని పరీక్షలు చేయగా ఎలుక జ్వరమని నిర్ధారించారు. ఆరోగ్యం విషమించడంతో అతడు మరణించాడు.
ర్యాట్ ఫివర్ అంటే ఏమిటి
ఎలుకలు, పందికొక్కులు వంటివి తాకిన, మలమూత్రాలు విసర్జించిన ఆహార పదార్థాలు, నీరు సేవించినప్పుడు వాటిలోని బ్యాక్టీరియా మనుషుల్లోకి వెళ్లి ఒక విధమైన జ్వరాన్ని కలిగిస్తాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా రెండు వారాల వరకు ఈ సమస్యలు ఉంటాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎలుకలు, పందికొక్కులు వంటివి ఇళ్లలో లేకుండా చూసుకోవాలి. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను వాటికి అందకుండా సురక్షితమైన స్థలాల్లో ఉంచుకోవాలి. ఈ జ్వరానికి ప్రస్తుతమున్న యాంటి బయాటిక్స్ ఔషధాలతో చికిత్స పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment