Rat Fever
-
ఎలుక జ్వరానికి ఒకరు బలి
కర్ణాటక: కొడగు జిల్లాలో అరుదైన ఎలుక జ్వరం ఒకరిని పొట్టనబెట్టుకుంది. ఎలుక జ్వరం (ర్యాట్ ఫివర్) వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన మడికెరి తాలూకాలోని కెరికె గ్రామంలో జరిగింది. గ్రామానికి దగ్గర ఉన్న చంబేరి అనెపారె ప్రాంతానికి చెందిన యువకుడు లిబీన్కు ఎలుక జ్వరం సోకింది. స్థానిక కూలి కార్మికుడు బాలన్ కుమారుడు ఆయిన లిబీన్ కేరళలో ఉన్న పెరియారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా కామెర్లు సోకినట్లు వైద్యులు తెలిపారు. తరువాత మరిన్ని పరీక్షలు చేయగా ఎలుక జ్వరమని నిర్ధారించారు. ఆరోగ్యం విషమించడంతో అతడు మరణించాడు. ర్యాట్ ఫివర్ అంటే ఏమిటి ఎలుకలు, పందికొక్కులు వంటివి తాకిన, మలమూత్రాలు విసర్జించిన ఆహార పదార్థాలు, నీరు సేవించినప్పుడు వాటిలోని బ్యాక్టీరియా మనుషుల్లోకి వెళ్లి ఒక విధమైన జ్వరాన్ని కలిగిస్తాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా రెండు వారాల వరకు ఈ సమస్యలు ఉంటాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎలుకలు, పందికొక్కులు వంటివి ఇళ్లలో లేకుండా చూసుకోవాలి. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను వాటికి అందకుండా సురక్షితమైన స్థలాల్లో ఉంచుకోవాలి. ఈ జ్వరానికి ప్రస్తుతమున్న యాంటి బయాటిక్స్ ఔషధాలతో చికిత్స పొందవచ్చు. -
కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు
శివమొగ్గ: కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జూన్ నెలలోనే సుమారు 51 మంది ఈ జ్వరానికి గురయ్యారని చెప్పారు. ఏమిటీ ఎలుక జ్వరం రెండు రకాల బ్యాక్టీరియా వల్ల ఎలుక జ్వరం సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన ఎలుకలు, పందికొక్కులు వంటి జీవులు మనిషిని కరిచినా, లేదా అవి కొరికిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను తిన్నా ఈ జబ్బు వ్యాపించే ప్రమాదముంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒంటి నొప్పులు, కొందరిలో కీళ్ల వాపు, దద్దుర్లు ఈ జ్వరం లక్షణాలు. చలి–జ్వరం విడిచి విడిచి వస్తుంటుంది. వైద్యులను కలిసి యాంటి బయాటిక్స్ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ జ్వర పీడితుల నుంచి దూరంగా ఉండడం మంచిది. పరిసరాల్లో ఎలుకలు, పందికొక్కులు లేకుండా చూసుకోవాలి. చదవండి: (అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు) -
కేరళను పీడిస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద బీభత్సం అనంతరం కేరళలో ర్యాట్ ఫీవర్ (లెప్టోస్పైరోసిస్) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోగా, 71 మందికి చేసిన రక్తపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మరో 123 మంది ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. పాలక్కడ్, కోజికోడ్ జిల్లాల్లో ర్యాట్ ఫీవర్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. వరదలు తగ్గుముఖం పట్టాక వివిధ రకాల జ్వరాలతో రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందిన వారి సంఖ్య 13,800 దాటింది. ర్యాట్ ఫీవర్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అలప్పుజ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలాచోట్ల పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
కేరళను కుదిపేస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్‌తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్‌తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.