
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచులో రూ.కోటి నగదు మాయమైంది. ఈ విషయం రెండు నెలల తర్వాత ఆలస్యంగా బయటకు పొక్కింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. రాయదుర్గం అర్బన్ సీఐ లక్ష్మన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతంలో ఇక్కడ మేనేజర్‌గా ఎస్‌ఎల్‌ఎన్ ఫణికుమార్ పనిచేశారు.
ఆయన తన తల్లితో పాటు ఇతరుల ఖాతాలకు రూ.1,00,07,323 నగదును మళ్లించి స్వాహాకు యత్నించారు. దీన్ని ఉన్నతాధికారులు గుర్తించి తనిఖీలు నిర్వహించారు. నగదు ఇతరుల ఖాతాలకు అక్రమంగా మళ్లించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ ఏడాది జూన్ 21న ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మేనేజర్‌పై 409, 420, 468, 471, 477–ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ విషయం బయటకు పొక్కకుండా ఎస్‌బీఐ సిబ్బంది, పోలీసులు ఇన్నాళ్లూ జాగ్రత్తపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎట్టకేలకు బహిర్గతమైంది. బ్యాంకు అధికారులు నగదు రికవరీ చేయడంతో పాటు మేనేజరును విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment