ఇడ్లీలు తయారు చేస్తున్న కాంతమ్మ
కర్ణాటక: అరచేయంత ఇడ్లీ ధర రూపాయి మాత్రమే. పాల మాదిరిగా తెల్లగా ఉండే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే క్షణాల్లో కరిగి పోతాయి. ఎలాంటి లాభార్జన లేకుండా పేదల ఆకలి తీర్చాలనే ఉదాత్త ఆశయంతో కాంతమ్మ అనే మహిళ 20 సంవత్సరాలగా రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది. ఇక్కడ ఇడ్లీ, చట్నీ తిన్నవారు ఆహా ఏమి రుచి అని అంటుంటారు. మళ్లీ మళ్లీ వస్తుంటారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హులియారులో బనశంకరమ్మ దేవాలయం ఆలయం వద్ద శిథిలావస్థలో ఉన్న ఇంటివద్ద కాంతమ్మ చిన్నపాటి హోటల్ నిర్వహిస్తోంది.
ఇడ్లీలోకి వేరుశనగ పొడి, పల్లీల చట్ని చేసి అందిస్తుంది. గతంలో 2 రూపాయలకు మూడు ఇడ్లీలు ఇచ్చిన కాంతమ్మ.. నిత్యావసరాల ధరలు పెరగడంతో రూపాయికే ఇడ్లీ అందజేస్తోంది. హోటల్ వద్దకు రాలేనివారు ఫోన్ చేస్తే పార్శిల్ పంపుతుంది. ఇందుకు ఎక్స్‌ట్రా చార్జీలు ఏమీ ఉండవు. అరిసికెరె తాలూకా కురువంక గ్రామానికి చెందిన కాంతమ్మకు హులియారుకి చెందిన తమ్మయ్యతో 24 సంవత్సరాల క్రితం వివాహమైంది.
భర్త మద్యానికి బానిస కావడంతో సంసారాన్ని ఆమె తన చేతుల్లోకి తీసుకొని ఇడ్లీల వ్యాపారం మొదలు పెట్టింది. ఇంటివద్ద ఇడ్లీలు తయారు చేసుకొని పాత్రలో పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి విక్రయించేది. వయస్సు మీద పడటంతో ప్రస్తుతం ఇంటివద్దనే తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఇడ్లీలతోపాటు దోసెలు కూడా అమ్ముతోంది. రూ.5కే మూడు దోసెలు అందజేస్తోంది. రుచిగా ఉండటంతో చాలా మంది వచ్చి గంటల తరబడి వేచి ఉండి దోసెలు, ఇడ్లీలు తిని వెళ్తుంటారు. గతంలో కట్టెల పొయ్యిపై ఇడ్లీలు తయారు చేసే కాంతమ్మ.. ప్రస్తుతం గ్యాస్‌స్టౌపై తయారు చేస్తోంది.
ఆరని పొయ్యి
కాంతమ్మ ఇడ్లీలు అమ్మి పెద్దగా డబ్బు సంపాదించిన దాఖలాలు లేవు. అరకొర సంపాదనతోనే పిల్లలను పెంచి పోషించి చదివించి పెళ్లిళ్లు కూడా చేసింది. మహమ్మారి కరోనా సమయంలో తప్ప ఆమె అంటించిన పొయ్యి ఇంతవరకు ఆరిపోలేదు. రోజూ 300 నుంచి 400 ఇడ్లీలు తయారు చేస్తుంది. ఒక్కరూపాయికే ఇడ్లీ అమ్మితే నష్టం రాదా? అని అడిగితే లాభం కోసం తాను ఈ పనిచేయడం లేదని కాంతమ్మ అంటోంది. తాను బతుకుతూ మరింతమంది పేదల ఆకలి తీర్చడమే తన ధ్యేయమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment