కర్ణాటక: భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసిన కేసులో భర్తతో పాటు ఆతని ఇద్దరు స్నేహితులకు శివమొగ్గ నగర మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. తలా రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. శివమొగ్గ నగరంలోని వెంకటేశ్వర నగరలోని 5వ క్రాస్‌లో నివాసం ఉంటున్న కార్తీక్‌కు, శ్రీరామనగరకు చెందిన రేవతికి 2017లో వివాహమైంది.
వివాహానికి ముందే రేవతి తన ఇంటి ముందు నివాసం ఉంటున్న విజయ్(22)ను ప్రేమించింది. వివాహమైన తర్వాత రేవతి నిత్యం తన భర్తతో గొడవపడేది. కొన్ని సార్లు పుట్టింటికి వెళ్లగా తల్లిదండ్రులు సర్దిచెప్పి కాపురానికి పంపారు. మరోమారు పుట్టింటికి వెళ్లిన రేవతి తన ప్రియుడితో కలిసి ఉండేది. దీంతో ఇద్దరినీ కడతేర్చాలని భావించిన కార్తీక్.. స్నేహితులు భరత్.ఎ(23), సందీప్(21)తో కలిసి పథకం రచించాడు.
2018 జనరి 10న మాట్లాడే పనుందని చెప్పి రేవతిని, ఆమె ప్రియుడు విజయ్‌ను వడ్డినకొప్ప గ్రామంలోని ఒక తోటలోకి పిలిపించారు. అక్కడ వేట కొడవళ్లతో ఇద్దరినీ నరికి తలపై బండరాళ్లతో బాది హత్య చేశారు. తుంగానగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి కార్తీక్, భరత్, సందీప్‌ను అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం నిరూపితం కావడంతో ముగ్గురికీ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment